Wednesday 30 September 2015

జాతీయ పార్టీగా ఎదిగే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందా?


వారం రోజుల క్రితం అండమాన్ లో పోర్ట్ బ్లెయిర్ మునిసిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 24 స్థానాలకు గాను 18 స్థానాల్లో పోటి చేసి 2 స్థానాలు మంచి ఆధిక్యతతో గెలుపొందింది, మరో 4 స్థానాల్లో రెండవ స్థానంలో నిలిచింది. విశేషమేమిటంటే తెలుగుదేశం పార్టీ తరుపున గెలుపొందిన వారిరువురు మహిళా అభ్యర్ధులే, వీరిలో ఒకరు తమిళ మరొకరు బెంగాలి. బిజెపి తరుపున నలుగురు తెలుగువారు గెలుపొందారు. ఇక్కడ బిజెపి, తెలుగుదేశం పార్టీ కలిసి పోటి చేస్తే తెలుగుదేశం పార్టీకి మరొక నాలుగు స్థానాలు, బిజెపి పార్టీకి మరో రెండు స్థానాలు అదనంగా లభించి ఉండేవి. వచ్చే ఎన్నికల్లో తెదేపా, బిజెపి ఇక్కడ కలిసి పోటిచెస్తే తెలుగుదేశం పార్టీ బలపడే అవకాశం ఉంది. అండమాన్ దీవుల్లో తెలుగు వారి జనాభా షుమారుగా 49,000, వీరిలో ఎక్కువ మంది పోర్ట్ బ్లెయిర్ లో ఉంటున్నారు. 

తెలుగువారి జనాభా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా తరువాత అత్యధికంగా తమిళనాడులో సుమారుగా 78,00,000, కర్ణాటక రాష్ట్రంలో 22,00,000, మహారాష్ట్ర లో 14,00,000, ఛత్తీస్ ఘర్ లో 11,50,000, ఒరిస్సాలో 2,30,000 ఉంటుంది. 


తమిళనాడు రాష్ట్రంలో 22 మంది తెలుగు వారు శాసన సభ్యులుగా, ఇద్దరు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు, రాష్ట్ర మంత్రి వర్గంలో కూడా నలుగురు తెలుగు వారు మంత్రులుగా, ఒకరు ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు 50 మందికి తక్కువ కాకుండా తెలుగువారు తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యే వారు, కాని రాను రానూ ఈ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఇక్కడి తెలుగు వారికి తెలుగు మాట్లాడటం తప్ప రాయటం, చదవటం తెలియదు. చెన్నై పట్టణం, క్రిష్ణగిరి, సేలం, కోయంబత్తూర్, వెల్లూరు, కాంచీపురం, నమక్కల్, కరూర్, తిరువళ్లూర్, తిరువన్నమలై, దుండిగల్, తిరునెల్వేలి, విరుదునగర్, మదురై, తిరుచ్చి, తూత్తుకుడి, రామనాధపురం, కడలూరు జిల్లాల్లో తెలుగువారు గణనీయంగా ఉన్నారు.  తమిళనాడు రాష్ట్రంలో MDMK అధ్యక్షుడు వైగో, DMDK అధ్యక్షుడు విజయకాంత్ కూడా తెలుగు వారే. ప్రస్తుత ప్రభుత్వం తెలుగు భాషపై చూపుతున్న నిర్లక్ష్య, పక్షపాత వైఖరిని ఇక్కడి తెలుగు ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో తెలుగు వారి జనాభా ఎక్కువగా ఉన్న ఇక్కడి తెలుగు వారిలో భాషాభిమానం మెండుగా ఉన్నా కాని రాజకీయంగా ఒకేతాటిపైకి రావటం చాలా కష్టం.  కొన్ని నెలల క్రితం తమిళనాడు తెలుగుదేశం పార్టీ తమిళనాడు శాఖకు అంకురార్పణ జరిగింది, కానీ రాష్ట్రంలో తెలుగు ప్రముఖులెవరు ఇందులో చేరటానికి ప్రస్తుతం ఆసక్తిగా లేరు. పార్టీ పరంగా ఇప్పటినుంచి గట్టి పునాది వేసుకుంటే వచ్చే ఎన్నికల్లో రాందాస్ సారధ్యం లోని పి.యమ్.కె, విజయకాంత్ సారధ్యం లోని డి.యమ్.డి.కె పార్టీలతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ పోటి చేస్తే కనీసం రెండు, మూడు సీట్లు సాధించే అవకాశం ఉంది. 


తెలుగు వారి జనాభా గణనీయంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక నాలుగవ స్థానంలో ఉంది. కర్ణాటకలో తెలుగు వారి జనాభా బెంగుళూరు, బళ్ళారి, కొప్పల్, రాయచూర్, యాద్గిర్, చిత్రదుర్గ, ధవణగిరి, కోలార్, తుంకూర్, చిక్కబల్లాపూర్, గుల్బర్గా, బీదర్ జిల్లాల్లో ఎక్కువగా ఉంది. ఇక్కడి తెలుగు వారిలో చాలా మందికి తెలుగు భాష బాగా మాట్లాడటమే కాకుండా రాయటం, చదవటం కూడా వచ్చు. ఈ రాష్ట్రంలో తెలుగు సంఘాలు చాలా చైతన్యవంతంగా పనిచేస్తున్నాయి. విశేషమేమిటంటే ఈ రాష్ట్రంలో కన్నడ మాతృ భాషగా కలిగిన వారు కూడా కొంతమంది తెలుగు చక్కగా మాట్లాడగలుగుతారు  కర్నాటక రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగు వారు 8 మంది శాసనసభ్యులు, ఇద్దరు ఎంపిలు, ఇద్దరు మంత్రులు ఉన్నారు. బెంగుళూరు కార్పొరేషన్ మేయర్, 14 మంది కార్పొరేటర్లు తెలుగు వారే. ఇక్కడ తెలుగు వారు ఎక్కువగా బిజెపి పార్టీలో ఉన్నారు. కొన్ని నెలల క్రితమే కర్ణాటక లో  తెలుగుదేశం పార్టీ శాఖ ఏర్పాటైంది. ఇక్కడ బిజెపితో లేదా జనతాదళ్ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ నాలుగైదు స్థానాలు సులువుగా గెలుచుకునే అవకాశం ఉంది.


తెలంగాణా రాష్ట్రం సరిహద్దులో  ఉన్న మహారాష్ట్రలో షోలాపూర్, నాందేడ్, లాతూర్, చంద్రాపూర్ జిల్లాల్లో తెలుగు వారు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. కాని ఇక్కడ తెలుగు వారిలో మొదటి నుండి రాజకీయ చైతన్యం తక్కువ, అప్పుడప్పుడు ఒకరిద్దరు శాసనభ్యులుగా గెలవటం తప్ప రాజకీయంగా మహారాష్ట్ర శాసనసభలో తెలుగువారికి ఎప్పుడూ పెద్దగా ప్రాతినిధ్యం లభించలేదు. సరిహద్దు జిల్లాల్లో కన్నడిగుల ప్రభావం కూడా ఎక్కువే. ముంబాయిలో దక్షిణ భారతదేశం నుండి వెళ్ళిన వాళ్ళు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. మహారాష్ట్రలో కన్నడిగుల, తమిళుల మద్దతుతో పోటిచేస్తే తప్ప ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కనీస సంఖ్యలో కూడా ఓట్లు పోలయ్యే అవకాశం లేదు. బహుశా మహారాష్ట్రలో తెలుగుదేశం పార్టీ పోటీ చెయ్యకపోవచ్చు.


ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బస్తర్, దంతేవాడ, రాయపూర్, బిలాసపూర్ జిల్లాల్లో తెలుగు వారి జనాభా చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉంది. ముఖ్యంగా వీరిలో ఎక్కువమంది షెడ్యూలు తెగలకు చెందిన వారు ఉన్నారు. ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీలో ప్రస్తుతం ఇద్దరు తెలుగు శాసనసభ్యులకు ప్రాతినిధ్యం ఉంది. ప్రస్తుత బిలాస్పూర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ వాణి రావు తెలుగు వారే. వీరి మామగారు ఈడ్పుగంటి అశోక్ రావు గతంలో దిగ్విజయ్ సింగ్ మంత్రివర్గం లో మంత్రిగా, బిలాస్పూర్ కార్పోరేషన్ కు మొదటి మేయర్ గా కూడా పనిచేసారు. అశోక్ రావు తండ్రి ఈడ్పుగంటి రాఘవేంద్ర రావు గారు స్వాతంత్రానికి పూర్వం మధ్య పరగణాలు మరియు బీరార్ ప్రాంతానికి గవర్నర్ గా, కొంత కాలం మధ్య ప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభ్యునిగా, మంత్రిగా,  పాత నాగపూర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. వీరే కాకుండా మరికొందరు తెలుగు వారు కూడా గతంలో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఇక్కడ బిజెపి తో కలిసి పోటి చేస్తే తెలుగుదేశం పార్టీకి ఒకటి లేదా రెండు సీట్లు లభించ వచ్చు. ఒంటరిగా పోటి చేసిన పక్షంలో పెద్దగా ప్రభావం చూపించలేక పోవచ్చు. 


శ్రీకాకుళం సరిహద్దులో ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో తెలుగు వారి జనాభా సుమారుగా 2,30,000 ఉంటుంది. సరిహద్దు జిల్లాలైన కోరాపుట్, రాయగడ, గజపతి, గంజాం జిల్లాల్లో తెలుగు మాట్లాడే వారి జనాభా గణనీయంగానే ఉంది. ఈ జిల్లాల్లో తెలుగు వారు శాసనసభకు ఎన్నికవుతున్నారు, ప్రస్తుతం ముగ్గురు తెలుగువారు ఒరిస్సా అసెంబ్లీలో శాసనసభ్యులుగా ఉన్నారు. బరంపురం నుండి గతంలో తెలుగు వారైన మాజీ ప్రధాని పి.వి నరసింహారావు 1996 లో యంపి గా ఎన్నికైన విషయం అందరికి తెలిసిందే.1957 నుండి 1980 వరకు ఇక్కడ తెలుగు వారైన జగన్నాథరావు యంపి గా ఉండేవారు. మాజీ రాష్ట్రపతి వివి గిరి బరంపురం వాసి. గతంలో రాయగడ జిల్లా, జైపూర్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికైన నూతక్కి రామ శేషయ్య ఒరిస్సా రాష్ట్ర ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. సరిహద్దు జిల్లాల్లో తెలుగు వారి జనాభా పర్లాకిమిడి, ఛాత్రపూర్, గోపాలపూర్, చికిటి, బెర్హంపూర్, జైపూర్, కోరాపుట్ మొదలైన ప్రాంతాల్లో గణనీయంగా ఉంది. బిజెపి తో లేదా బిజు జనతాదళ్ పార్టీతో పెట్టుకుని పోటి చేస్తే ఒరిస్సాలో తెలుగుదేశం పార్టీ మూడు నుండి నాలుగు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఒంటరిగా పోటి చేసినా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కనీసం ఒకటి లేదా రెండు స్థానాలు దక్కే అవకాశం ఉంది. 


జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, అండమాన్ రాష్ట్రాల్లో తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపి, గణనీయమైన సంఖ్యలో స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉంది. శాసనసభ ఎన్నికల్లో కూడా కొద్దోగొప్పో ప్రభావం చూపి కొద్ది సంఖ్యలో స్థానాలు సాధించే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటి చేసేకంటే బిజెపి లేదా అక్కడి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటిచేస్తే తన ఉనికిని చాటుకుని, బలం పెంచుకునే అవకాశం ఉంది. 

No comments:

Post a Comment