Wednesday, 3 December 2014

ఓ ఉద్యమ యోధుడి వీర చరిత్ర: 'చండ్ర' ప్రచండుడు

Picture
దేశం మనకేమి ఇస్తుందని ఎదురు చూస్తోంది నేటితరం. దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించింది వెనకటితరం. స్వాతంత్య్రం, సమసమాజ నిర్మాణం కోసం వ్యక్తిగత జీవితాలను త్యాగాలు చేసింది ఆనాటి తరం. ఏళ్ళతరబడి ఉద్యమాల్లో,అజ్ఞాత వాసంలో గడిపిన ఆనాటి నాయకుల్లో సుప్రసిద్ధులు చండ్ర రాజేశ్వరరావు. కమ్యూనిస్టు పార్టీకి ఆరున్నర దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో సేవలందించిన రాజేశ్వరరావుగారి సంస్మరించుకునే ప్రయత్నమే ఇది. 

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కి 28 సంవత్సరాల సుదీర్ఘ కాలం నేతృత్వం వహించిన రాజేశ్వరరావు జీవితం వడ్డించిన విస్తరే. ఒడిదుడుకులు లేని బాల్యమే అయినా, 'చిన్ని నా పొట్ట శ్రీరామరక్ష' అని అనుకోకుండా, పేదల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాటాలు సాగించిన యోధుడు. సైద్ధాంతిక నిబద్ధతకు, నిజాయితీకీ నిలువుటద్దం. తెలంగాణా సాయుధ పోరాట యోధులతో జతకట్టిన కమ్యూనిస్టు. దేశాధినేతలతోనైనా,సాటి కామ్రెడ్స్‌తోనైనా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించిన నిర్మొహమాటి. నెహ్రూ,ఇందిరాగాంధీలు తీసుకున్న నిర్ణయాల్లో ప్రజోపయోగమైనవాటిని సమర్ధించిన నోటితోనే,వారి నిరంకుశ చర్యలను తెగనాడిన నిష్పక్షపాతి. అపరకర్మలపై నమ్మకం లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం తండ్రి చితికినిప్పు పెట్టి 'రుణం' తీర్చుకున్న నిజాయితీపరుడు

పేదల పక్షాన నిలిచేందుకు తొలిదినాల్లో చల్లపల్లి జమిందార్‌తో,జాతీయ నాయకునిగా కేంద్రంతో అలుపెరగని పోరాటం సాగించిన యోధుడు.అందుకే,ఆయన పేదల హృదయాల్లో ఇప్పటికీ గూడుకట్టుకుని ఉన్నాడు. చండ్ర రాజేశ్వరరావు భారత కమ్యూనిస్టు పార్టీ తొలితరం అగ్రనాయకుల్లో ఒకరు. ఇంటిపేరుకు తగినట్టుగానే ప్రత్యర్ధులపై చండ్ర నిప్పులు కురిపించేవారు. ఆనాటి తరం నాయకుల్లో కానవచ్చే నిరాడంబరత్వం,నిర్మొహమాటం,నిష్కపటం, నిర్భీతి, నిష్కళంకం వంటి సహజ లక్షణాలన్నీ కలబోసిన వ్యక్తి ఎంత గంభీరమో, మాట కూడా అంతగంభీరమే.ఆనాటితరం వారంతా బహిరంగ సభల్లో మైకులు లేకుండానే మాట్లాడేవారు. రాజేశ్వరరావుగారి భారీ విగ్రహానికి తగినట్టేఆయన స్వరం ఉండేది.అయితే,ఆయన హృదయం వెన్న. 

పీడిత,తాడిత జనోద్ధరణ కోసం ఎంతో ఉజ్వలమైన భవిష్యత్‌ను వదులు కుని కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు.పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, తరిమెల నాగిరెడ్డి,నీలం రాజశేఖరరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు అవిభక్త కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులుగా దశాబ్దాల పాటు రాష్ట్రంలోనే కాక,దేశంలోని పలు ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశారు. 

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలోని మంగళాపురం గ్రామంలో 1914 జూన్‌ ఆరవ తేదీన పెద్ద భూస్వాముల కుటుంబంలో జన్మించిన రాజేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీలో చేరిన తరువాత ఆ భూస్వాములకు వ్యతిరేకంగా, భూమి లేని నిరుపేదల తరఫున దశాబ్దాలపాటు పోరాటం జరిపారు. ఆయన తండ్రి సుబ్బయ్యగారి పూర్వీకులు చెంగల్పట్‌ ప్రాంతానికి చెందిన వారు. వ్యవసాయ పనుల నిమిత్తం నెల్లూరు,గుంటూరు జిల్లాలకు వలస వచ్చిన సుబ్బయ్యగారి పూర్వీకులను చల్లపల్లి జమిందార్‌ తన ఎస్టేట్‌లో స్థిరపడమని కోరాడు. చల్లపల్లికి నాలుగు వైపులా ఉన్న అడవుల్లో గ్రామాలను నిర్మించేందుకు అనుమతి ఇచ్చాడు. అలా ఏర్పడిన గ్రామాల్లో మంగళాపురం ఒకటి. రాజేశ్వరరావుగారు తల్లి తండ్రులకు మూడో సంతానం.ఆయన తరువాత ఒక చెల్లెలు.ఆయన నాల్గవ ఏటనే తల్లి మరణించడంతో పెద తల్లి, నాయనమ్మ,మేనత్తల పెంపకంలో పెరిగారు. 

రాజేశ్వరరావుగారి ప్రాథమిక విద్యాభ్యాసం మంగళాపురంలోనే సాగింది. సెకండరీ విద్య చల్లపల్లిలోనూ సాగింది. బందరు హిందూ స్కూలులో ఎస్సెస్సెల్సీ పూర్తిచేశారు.విద్యార్ధి దశలోనే రాజేశ్వరరావు క్రీడాకారునిగా, పేదల పాలిట ఆత్మీయునిగా పేరొందారు.మనిషి ఆజానుబాహువు కావడం వల్ల ఆయన పేరు చెబితేనే ఆరోజుల్లో రౌడీలు హడలెత్తేవారు. మహాత్మా గాంధీ పిలుపుపై సాగిన ఉప్పు సత్యాగ్రహంలో వలంటీర్‌గా పని చేశారు. యుక్తవయసులోనే విప్లవ భావాల పట్ల ఆకర్షితులయ్యారు.మహాత్మాగాంధీ ఉద్యమాల్లో పనిచేస్తున్నా, విప్లవ కిశోరాలైన భగత్‌సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌ వంటివారి పట్ల ఆరాధనా భావాన్ని పెంచుకున్నారు. బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో చదువుకుంటున్న రోజుల్లోనే ఆయన హిందూ,ముస్లిం ఐక్యత కోసం ఎంతోకృషి చేశారు.కమ్యూనిస్టు నాయకులను ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం మీరట్‌ కుట్ర కేసులో ఇరికించి జైళ్ళలో పెట్టినప్పుడు వారు విడుదల చేసిన ప్రకటన రాజేశ్వరావును ఉత్తేజపర్చింది.వామపక్ష భావాలున్న విద్యార్ధులందరినీ ఐక్యపర్చి సాటి విద్యార్ధులతో కలిసి ఒక స్టడీ సర్కిల్‌ని ఏర్పాటు చేశారు.ఆ తరువాత అది 'యంగ్‌ కమ్యూనిస్టు లీగ్‌'గా అవతరించింది. చదువుకునే రోజుల్లో ఖర్చుల కోసం తండ్రి పంపే డబ్బులో కొంత మిగల్చుకుని రాజేశ్వరరావు,ఆయన సోదరుడు రామలింగయ్యగారు పేదలకు సాయం చేసేవారు. ఓసారి తల్లికి అలహాబాద్‌లో పిండప్రదానం చేయమని తండ్రి డబ్బు పంపిస్తే, ఆ డబ్బుతో పేదలకు అన్నదానం చేశారు. ఆ విషయం దాపరికం లేకుండా తండ్రికి తెలియజేయడం ఆయనలోని నిష్కపటత్వానికి నిదర్శనం. 

బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లోనే మతవాద,మితవాద వర్గాలను ధైర్యంగా ఎదుర్కొన్న ధీశాలి రాజేశ్వరరావు. తరచుగా ఘర్షణలకు దిగడం, కమ్యూనిస్టు వర్గానికి నాయకత్వం వహించడంతో బిఎస్సీ పూర్తి కాకముందే ఆయన యూనివర్శిటీ నుంచి టీసీ తీసుకుని బయటికి వచ్చారు. బెనారస్‌లో ఉండగానే ఆయన లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకు హాజరయ్యారు. జవహర్‌లాల్‌ నెహ్రూ సోవియట్‌ రష్యా సందర్శించి వచ్చిన తరువాత సోషలిజం,స్వాతంత్య్ర పోరాటంలో కార్మిక,కర్షక పాత్ర, వర్గ సం ఘాలు,వర్గ పోరాటాల పేరిట రాసిన వ్యాసాలు రాజేశ్వరరావును విశేషంగా ఆకర్షించాయి.అదే సందర్భంలో ఆయన మహాత్మాగాంధీని కలిసిన విద్యార్ధి బృందంలో ఉన్నారు. ఆ తరువాత ఆయన ఇంటికి వచ్చి తండ్రి గారి అనుమతితో విశాఖలో మెడిసిన్‌లో చేరారు. అయితే,అక్కడ కూడా ఆయన కమ్యూనిస్టు భావాల ప్రచారానికి నిడమర్తి ఉమారాజేశ్వరరావు ప్రభృతులతో కలిసి స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టు భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పట్లో ఆంధ్రా యూనివర్శిటీకి భారత రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాథాకృష్ణన్‌ వైస్‌చాన్సలర్‌గానూ, ప్రొఫెసర్‌ హిరేన్‌ ముఖర్జీ అధ్యాపకునిగాను ఉండేవారు.విశాఖలో ఉన్నప్పుడే వివిధ కార్మిక సంఘాల కు నేతృత్వం వహించారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం వల్ల ఆయన చదువు బెనారస్‌లోనూ, విశాఖలోనూ సవ్యంగా సాగలేదు. 

తండ్రి అభిమతానికి వ్యతిరేకంగా ఆయన సావిత్రమ్మగారితో వివాహాన్ని అతి నిరాడంబరంగా దండల మార్పుతో చేసుకున్నారు. వారి వివాహానికి ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు మద్దూరి అన్నపూర్ణయ్య పెళ్ళిపెద్దగా వ్యవహించారు. సావిత్రమ్మ కూడా భర్త మార్గంలోనే కమ్యూనిస్టు ఉద్యమం ప్రచారం కోసం జీవితాంతం కృషిచేశారు. వివాహానికి గుర్తుగా మెడలో వేసుకున్న గొలుసు రాయిని తీయించి ఎర్ర నక్షత్రాన్ని వేసుకోవడం ఆమె నిబద్ధతకు నిదర్శనం. పార్టీ నిర్ణయం మేరకు పూర్తి కాల కార్యకర్తగా పనిచేయడం కోసం ఆమె శాంతినికేతన్‌లో చదువుకోవాలనే ఆకాంక్షను బలవంతంగా అణగదొక్కుకున్నారు. 

కృష్ణా జిల్లాలో కమ్యూనిస్టుపార్టీ విస్తరణకు రాజేశ్వరరావు దంపతులు విశేషంగా కృషిచేశారు. కార్మిక,కర్షక సంఘాలను ఏర్పాటు చేసి, మంగళాపురం కూలీల పోరాటానికి,చల్లపల్లి జమిందారు అక్రమాలపై ఉద్యమానికి నేతృత్వం వహించారు. కృష్ణాజిల్లా తిరువూరు తాలూకాలో నైజాం సరిహద్దున ఉన్న తునికిపాడులో రాజకీయ పాఠశాలకు వచ్చిన రావి నారాయణరెడ్డి,బద్దం ఎల్లారెడ్డి ప్రభృతులు నైజాంలో పరిస్థితి గురించి వివరించారు. ఆ క్రమంలోనే రాజేశ్వరరావుకు ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చిర్రావూరి లక్ష్మీనరసయ్య ప్రభృతులు కూడా రావడంతో వారందరితో కూడా రాజేశ్వరరావుకు పరిచయాలు ఏర్పడ్డాయి. క్రమంగా తెలంగాణాలో అనేకసార్లు పర్యటించి తెలంగాణాలో పార్టీ నిర్మాణానికీ,భువనగిరి ఆంధ్ర మహాసభ నిర్వహణకు తోడ్పడ్డారు. తెలంగాణా కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనాయకులను సమన్వయపర్చడంలో,సాయుధ పోరాటంలో కీలకపాత్ర వహించారు.

భారత విప్లవోద్యమం గురించి స్టాలిన్‌తో చర్చించేందుకు అజయ్‌ ఘోష్‌, ఎస్‌ఏ డాంగే,బసవపున్నయ్యలతో పాటు రాజేశ్వరరావు మాస్కో వెళ్ళారు. రాజేశ్వరరావు ఎంత పెద్ద నాయకుడైనా ఏమాత్రం అభిజాత్యాన్ని ప్రదర్శించకుండా,నిరంతరం ఏదో తెలుసుకోవాలనే తపనతో ఉండేవారు. పుచ్చలపల్లి సుందరయ్యగారి పట్ల ఎంతో గౌరవం ఉన్నా,అవిభక్త కమ్యూనిస్టు పార్టీ చీలినప్పుడు ఆయన భారత కమ్యూనిస్టు పార్టీకి నేతృత్వం వహించారు. ఆ తరువాత ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఐక్య పోరాటాలకు నేతృత్వం వహించాయి. 1969లో కాంగ్రెస్‌ చీలిపోయినప్పుడు ఆనాటిప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటి ప్రగతి శీల కార్యక్రమాలకు ఎస్‌ఎ డాంగే నేతృత్వంలోని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మద్దతు ఇచ్చింది.రాజేశ్వరరావు సిద్ధాంతాలతో ఏనాడూ రాజీ పడలేదు.ఇందిర ప్రభుత్వం తీసుకున్న ప్రగతి శీల చర్యలకు మద్దతు ఇచ్చినప్పటికీ, ఆమె నిరంకుశ పోకడలను తీవ్రంగా వ్యతిరేకించారు, 1970వ దశకంలో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో సాగిన భూ ఆక్రమణ ఉద్యమం పార్టీ ప్రతిష్ఠను పెంచింది.అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఉద్యమం విజయవంతం కావడంలో రాజేశ్వరరావుగారి పాత్ర ఎంతో ఉంది. 

రాజేశ్వరరావు పిత్రార్జితంలో వచ్చిన ఆస్తిలో తన వాటాను పూర్తిగా పార్టీకోసం వెచ్చించారు.పార్టీకి ఆయన విరాళంగా ఇచ్చిన లక్షలాది రూపాయిలతోఆరోజుల్లో వందలాది ఎకరాలను కొనగలిగి ఉండేవారు.కానీ,ఆయన ఆస్తులపై మమకారాన్ని ఏనాడూ పెంచుకోలేదు. హైదరాబాద్‌ చిక్కడపల్లి సొసైటీలో ఇల్లు ఇస్తామన్నా వద్దన్నారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలో స్థలాన్ని తీసుకోమని మిత్రులు ఎంత కోరినా తీసుకోలేదు.ఆయన ఢిల్లీ వెళ్ళినా,ఎక్కడికి వెళ్ళినా పార్టీ కార్యాలయాల్లోనే బస చేసేవారు, తన బట్టలను తానే ఉతుక్కునే వారు. ఎంత ఎదిగినా,ఎంత పేరు ప్రతిష్ఠలు సంపాదించినా ఆయన చివరి వరకూ నిరాడంబరంగానే జీవితం గడిపారు. పంజాబ్‌లో తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు కమ్యూనిస్టుపార్టీ తరఫున ఆయన సాగించిన కృషి మరువ లేనిది.అక్టోబర్‌ విప్లవం 60వ వార్షికోత్సవాల సందర్భంగా భటిండాలో జరిగిన పార్టీ మహాసభలో ఆమోదించిన తీర్మానం చరిత్రాత్మకమైనది.రాజేశ్వరరావు సోవియట్‌ యూనియన్‌లో గోర్బొచెవ్‌ ప్రవేశపెట్టిన సహకార వ్యవసాయం, కాంట్రాక్ట్‌ సేద్య విధానాలను రాజేశ్వరరావు సమర్ధించారు. దీనిపై ఆయన పార్టీ పత్రిక న్యూ ఏజ్‌లో వ్యాసం రాస్తూ భూముల్ని 25 నుంచి 35 సంవత్సరాల పాటు కౌలుకు ఇవ్వడం వల్ల భూసారాన్ని కాపాడబడుతుందనీ, ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు.సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిన తరువాత సంభవించిన పరిణామాల పట్ల ఆయన చివరి రోజుల్లో ఎంతో కలత చెందారు. 

పాలస్తీనా విమోచనా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.ప్రపంచంలో ఎక్కడ ప్రగతి శీల పోరాటాలు జరిగినా వాటికి ఆయన మద్దతు ప్రకటించేవారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అనేక సమస్యలపై ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉన్నప్పటికీ, సిపిఎం వ్యతిరేకధోరణి వల్ల ఉభయ కమ్యూనిస్టు పార్టీల పునరేకీకరణ ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆవేదన చెందేవారు.అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిపిన ప్రపంచ దేశాలకు భారత కమ్యూనిస్టుపార్టీ అండగా నిలవడంలో రాజేశ్వరరావుగారి పాత్ర ఎంతో ఉంది. ఆయన ఎన్నో పురస్కారాలను పొందినప్పటికీ, 1974 లో పొందిన సోవియట్ యూనియన్ అత్యంత ప్రతిష్ఠాకరమైన ఆర్డర్‌ ఆఫ్‌ లెనిన్‌ పురస్కారం మకుటాయమానమైనది. సుదీర్ఘకాలం పార్టీకోసం అహర్నిశలు కృషిచేసిన రాజేశ్వరరావు ఎనభైయవ ఏట 1994 ఏప్రిల్‌ 9వ తేదీన హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన పేరిట హైదరాబాద్‌ సిఆర్‌ ఫౌండేషన్‌ పని చేస్తోంది. కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కోసం అలుపెరగని పోరాటం సాగించిన రాజేశ్వరరావు ఆ ఉద్యమ ధ్రువతారగా చిరస్మరణీయులు. డా కిలారు పూర్ణచంద్రరావు

No comments:

Post a Comment