Showing posts with label Telugu articles. Show all posts
Showing posts with label Telugu articles. Show all posts

Wednesday, 28 January 2015

క్రిమినల్స్ కులమేది?


గత దశాబ్ద కాలంలో ఈ దేశంలో, రాష్ట్రంలో ఎన్నో స్కాములు బయట పడ్డాయి. నిందితుల్లో కొందరికి శిక్ష పడింది, కొందరు తప్పించుకున్నారు, మరి కొన్ని సుదీర్ఘ కాలంగా విచారణలో ఉన్నాయి. 

ఇటీవల "అగ్రి గోల్డ్" సంస్థ తన డిపాజిట్ దార్లకు  వేలాది కోట్ల రూపాయల మెచ్యురిటి డిపాజిట్ల తిరిగి చెల్లింపులో విఫలం కావటంతో ఆ సంస్థ నిర్వహిస్తున్న పోంజీ స్కీం వ్యహారం బయట పడింది. వంద కోట్లు అంతకు మించి పబ్లిక్ నుంచి వసూలు చేసే కంపెనీలు తమ అనుమతిని తప్పనిసరిగా సెబీ నిబంధనలు చెబుతున్నాయి. సెబి వద్దనున్న సమాచారం మేరకు ఈ సంస్థ ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని  పేద, మధ్యతరగతి వర్గాల నుంచి రకరకాల స్కీంల రూపంలో 7,000 కోట్ల రూపాయల వరకు సేకరించినట్లు తెలుస్తుంది. దీనిలో ఒక్క ప్రకాశం జిల్లా నుండే 1,500 కోట్లు మదుపు దారులనుండి సేకరించారు. 

ఇటీవలి కాలంలో సంస్థ వసూళ్ల కన్నా మెచ్యూర్ అయిన డిపాజిట్లకు చెల్లించాల్సిన మొత్తం పెరగటంతో లిక్విడిటీ సమస్య ఏర్పడింది. దీంతో డిపాజిటర్లకు చెక్కులు బౌన్స్ కావటం ప్రారంభమయింది. ఫలితంగా మదుపర్లు వీధిన పడ్డారు. ఇప్పటివరకు కంపెనీ జారీ చేసిన దాదాపు 290 కోట్ల రూపాయల చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఈ పరిణామంతో దిక్కుతోచని లక్షలాది మంది డిపాజిటర్లు ఆందోళనతో అగ్రిగోల్డ్ సంస్థ విజయవాడలోని కార్యాలయం పైన దాడికి దిగారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. 

కంపెనీపై కర్నాటక, ఆంధ్రప్రదేశ్ కి చెందిన కొందరు కస్టమర్లు ఇప్పటికే ఆర్బీఐకి, సెబీ కి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై విచారణ కొనసాగుతుండగానే విజయవాడకు చెందిన కన్సూమర్ గైడెన్స్ సొసైటీ సెబీకి ఈ కంపెనీ నడుపుతున్న అనధికార పోంజీ స్కీంలపై పిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూ వచ్చింది. ఆర్టీఐ యాక్టు కింద సేకరించిన సమాచారాన్ని అగ్రిగోల్డ్ అవకతవకలకు నిదర్శనంగా సమర్పించింది. ఖమ్మం, జగ్గయ్యపేట ప్రాంతాల్లో దాదాపు వందమంది మదుపర్ల తరఫున సెబీకి పిర్యాదు చేసింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం, సెబి ఈ వ్యవహారంపై దృష్టి సారించి విచారణ చేపట్టింది, సిబిఐ దాడులు జరిపి సంస్థకు, యాజమాన్యానికి సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అగ్రి గోల్డ్ లిక్విడిటీ సమస్యకు అంతర్గతంగా చాలా కారణాలున్నాయని తెలిసింది. అందులో ముఖ్యమైనది ఛైర్మన్ అవ్వా వెంకటరామారావు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏహెచ్ఎస్వీ ప్రసాద్  కంపెనీ సొమ్మును తమ వ్యక్తిగత ఆస్థిగా మార్చుకుని, కొంత మొత్తం తమ బంధువుల బినామి పేర్లపై పెట్టినట్లు  చెప్పుకుంటున్నారు, ఈ మొత్తం 2,000 కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చని తెలిసింది. 

ఈ కంపెనీ డిపాజిట్లు, వడ్డీ కలిపి మొత్తం చెల్లించవలసిన సొమ్ము సుమారుగా 10,000 కోట్లు ఉంటుందని తేలింది. అగ్రిగోల్డ్ గ్రూపు రాజధాని ప్రాంతానికి ఆనుకుని ఉన్న హాయ్ లాండ్‌తోపాటు, 12,000 ఎకరాల భూములు, అగ్రి బిజినెస్, మీడియా, నిర్మాణ రంగాల్లో ఉంది. కంపెనీ వారు చెబుతున్న ప్రకారం దీని ఆస్థుల విలువ 15,000 కోట్ల వరకు ఉండవచ్చు.

అగ్రి గోల్డ్ కంపెనీపై సిబిఐ దాడులు, సెబి విచారణ వెనుక ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు, రామోజీ రావు, కమ్మ పారిశ్రామిక వేత్తల లాబీ ఉందని కొన్ని "గ్రేట్ ఆంధ్ర" లాంటి వెబ్ సైట్ లు, బ్లాగుల్లో, సాక్షి వంటి పేపర్లలో ఈ వ్యవహారం మొత్తం "బ్రాహ్మణ వర్గం" పైన "కమ్మ వర్గం" జరిపించిన దాడిగా ప్రచారం చేస్తున్నారు. అగ్రి గోల్డ్ పైన పిర్యాదు చేసిన వారిలో అన్ని కులాల భాదితులు, ముఖ్యంగా వెనుకబడిన, దళిత వర్గాల వారే ఎక్కువగా ఉన్నారు. 

"గ్రేట్ ఆంధ్ర" వెంకట రెడ్డి గతంలో తన వెబ్ సైట్ లో పిచ్చి రాతలు రాసినందుకు అరెస్ట్ చేసినా వాడికి ఇంకా సిగ్గు రాలేదు. ప్రతి చిన్న విషయానికి ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టే రాతలు రాసే ఇలాంటి వెధవలని సభ్య సమాజం నుండి బహిష్కరించాలి. వీడు ఎప్పుడైనా జగన్ అవినీతి పై కాని, గాలి జనార్ధన రెడ్డి అక్రమాలపై కాని, బ్రదర్ అనిల్ ఆక్రమణల పై కాని వీడి వెబ్ సైట్ లో వార్తలు రాశాడా? అన్ని కులాల్లోను వెధవలు ఉన్నారు.. మనం వారిని వ్యక్తిగతంగా విమర్శించవచ్చు అంతే కాని... ఆ కులాన్ని కాని, ఆ కులంలో అందరిని కాని విమర్శిస్తే అది సంస్కార హీనంగా ఉంటుంది. 

గతంలో వై.యస్.ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు "సత్యం" రామలింగరాజు అరెస్టు వెనుక, రామోజీ రావు "మార్గదర్శి" పై కేసు, పరిటాల రవి హత్య వెనుక, వై.యస్.ఆర్ హస్తం, క్షత్రియ, కమ్మ కులాల వారి పై రెడ్డి వర్గం వారి కుట్ర ఉందని అనుకోవాలా? ఆ తరువాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో "నిమ్మగడ్డ ప్రసాద్", "కోనేరు ప్రసాద్" అరెస్ట్ వెనుక ఎవరి హస్తం ఉందో, ఏ కులం వారి ప్రమేయం ఉందో ఈ వెధవలు వాళ్ళ వెబ్ సైట్ లో కాని, పేపర్లో కాని రాయలేదే? జగన్ ను అరెస్ట్ చేసినప్పుడు మాత్రం కమ్మ వర్గం, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ, రామోజీ రావు, రిలయన్స్ అంబానీ కలిపి పన్నిన కుట్ర అంటూ తమ మీడియాలో ప్రచారం చేశారు. వీళ్ళకి సిగ్గు, శరం ఉందా! వీళ్ళు అన్నమే తింటున్నారా? 

ఈ లోకంలో రెండే కులాలున్నాయి, "డబ్బున్న వాడు.. డబ్బు లేనివాడు"... సత్యం రామలింగరాజు వ్యహారంలో, రెండేళ్ళ క్రితం విజయవాడలో జరిగిన "ఉమా చిట్ ఫండ్స్" వ్యవహారంలో ఎక్కువగా నష్టపోయింది వారి కులాల వారే! ఆర్ధిక నేరస్తులు 420 జగన్, గాలి జనార్ధన రెడ్డి, విజయసాయి రెడ్డి, కోలా కృష్ణ మోహన్, కొసరాజు వెంకటేశ్వర రావు, కోనేరు ప్రసాద్, సత్యం రామలింగరాజు.. వీరిది ఏ కులం!... వీరందరిది నేర కులమే!! క్రిమినల్స్ కు కులం ఆపాదించవద్దు. అనవసరంగా నేరస్థులకు కొమ్ము కాస్తూ,  ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ, కులం రంగు పులమొద్దు. 

మీడియా అనేది ప్రజలకు న్యాయం చేసే విధంగా వార్తలు రాస్తూ, అక్రమార్కులను చీల్చి చెండాడాలి కాని, నేరస్తులకు మద్దతిస్తూ, వారికి కొమ్ము కాసే విధంగా ఉంటె.. వారిపై ఎప్పుడో ఒకప్పుడు నష్టపోయిన ప్రజలే తిరగబడి బుద్ధి చెబుతారు. 

Tuesday, 13 January 2015

మన ఊరు.. మన సంక్రాంతి...మకర సంక్రాంతి శుభాకాంక్షలు


తెలుగు లోగిళ్ళకు “తొలికాంతి” సంబరాల సంక్రాంతి

అంబరాన్ని అంటిన సంబరాల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేశాం, అందరూ బావుండాలి, అంతా మంచే జరగాలి అనే ఆశతో భవిష్యత్తుకు బాటలు పరిచేశాం. గత కొంతకాలంగా ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో విపత్కర పరిస్థితుల మధ్య క్షణ క్షణం భయంతో గడిపిన రైతన్న చల్లగా, చల్లని గాలుల మధ్య, ప్రశాంతంగా సేద తీరుతున్నాడు. పరవళ్ళు తొక్కిన నదులు, సంద్రాలు, కాలువల సాక్షిగా, తన చమట జల్లుని చిందించి నేల తల్లిని పులకరింప చేసి పచ్చని పల్లెలో వెలుగు నింపుతూ పచ్చగా రంగు వేసినట్లుగా పండిన పంటను చూసి ఎద్దుకొమ్ముల మధ్య సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ సంక్రాంతి పండగ చేసుకుంటున్నాడు.

అసలు సంక్రాంతి అంటే! చల్లని గాలుల నడుమ, పచ్చని పైరుల నడుమ, ప్రతీ ఊరు, ప్రతీ ఇల్లు ధాన్యపు రాశులతో, డూ డూ బసవన్నల నృత్యాలు, గంగిరెద్దు వాళ్ళ విన్యాసాలు, ఉషోదయాన్నే హరిదాసు చేసే గజ్జెల చప్పుళ్ళు, భం భం అనే జంగర దేవరలు, హంగామాతో హాస్యన్ని పండించే పగటి వేషగాళ్ళు, మా ఇంటికి రండీ అని స్వాగతించే గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు, గాలి పటాలతో సందడి చేసే పిల్లలు, ముంగిట్లో ఇంద్ర ధనస్సును నిలిపే రంగవల్లులు పందెం రాయుళ్ళ పౌరుషానికి పదును పెడుతూ వేసే కోడి పందాలు, చిట్టి పొట్టి పాపల బుడి బుడి అడుగులు, కొత్తగా పెళ్ళైన జంటలు, ఇలా అందరి సమక్షంలో బొమ్మల కొలువులతో, భోగి మంటల చాటున చల్లని ఉదయాన్ని ఆస్వాదిస్తూ, పాత వస్తువులను, కష్టాలను, భోగి మంటలకు సమర్పిస్తూ, చిన్నారులకు భోగి పళ్ళు పోస్తూ ఇబ్బందులు, ప్రమాదాలు ఇలా ఏమి కలగకుండా అందరు సుఖ సంతోషాలతో కలిసి ఉండాలి, ప్రతీ ఇల్లు ఒక హరివిల్లులా మారాలి. అదే అసలైన సంక్రాంతి, అందమైన, ఆనందమైన జీవితాలలో తొలి కాంతి. అసలు సంక్రాంతి అంటే పురాణాల సాక్షిగా సంక్రమణం, అంటే మార్పు చెందడం, సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి ఎందుచేతనంటే సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశిస్తాడు, అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత కలదు, ఈ మాసంలో మకర సంక్రాంతి రోజున, సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు అందుకే ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతన్నల కళ్ళల్లో విరిసే కోటి కాంతులతో, అనందాల కోలాహలంతో, ఈ పండుగను మూడు   రోజులుగా చేసుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. అందుకే దీనిని పెద్ద పండుగా అని కూడా పిలుస్తారు, మూడు రోజుల పండగలో మొదటిగా

భోగ భాగ్యాలను ఇచ్చే భోగి. ఈ అందమైన పండుగలో మొదటి రోజును భోగి అని పిలుస్తారు. ఈరోజు అందరూ భోగి మంటలతో ఉల్లాసంగా గడుపుతారు. ఈరోజు అందరూ ఉదయాన్నే లేచి ఎముకలు కొరికే చలిని తరిమేయడానికి పాతవస్తువులు అన్నీ సమకూర్చి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా వాటిని భోగి మంటల్లో మంట పెడుతూ చల్లని ఆ చలిలో వెచ్చదనాన్ని ఆశ్వాదిస్తారు. ఇక సాయంత్రం వేళ, బొమ్మల కొలువులతో, చాలా ఇళ్ళలో చిన్నపిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శిస్తూ ఆనందంగా, ఉల్లాసంగా అడుతూపాడుతూ గడుపుతారు. ఇక భోగి పళ్ళ పేరంటాలైతే అందరూ సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. అలా పండుగలో మొదటి రోజు, తొలి ఘట్టం పూర్తి అవుతుంది.తెలుగు సాంప్రదాయానికి ప్రతీక, సుఖ సంతోషాల గీతిక సంక్రాంతి పండుగ

మకర సంక్రాంతి రెండవ రోజు, అసలైన పండుగ రోజు సంక్రాంతి. ఈరోజు తెల్లవారగానే పాలు పొంగించి, కొత్త బట్టలు వేసుకుని, రుచికరమైన పిండి వంటలు తింటూ, సంతోషంగా గడుపుతూ ఈ పండుగను ఆస్వాదిస్తారు, మరో ప్రత్యేకత ఏమిటంటే సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. మరో ఆనందమైన, అలరించే విషయం ఏమిటంటే ఈ రోజున “హరిలో రంగ హరీ” అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమై సందడి చేస్తాడు. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ సరదాగా గడుపుతారు. రథం ముగ్గు, రంగ వల్లులతో ఇంటి ముంగిళ్ళు కళకళలాడతాయి. అయితే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు.

“ఆకలికి అన్నం పెట్టే రైతన్న కళకళలాడుతూ ప్రపంచమంతా వెలుగు నింపాలి”

సంక్రాంతి పండుగ మూడవ రోజు, చివరిదైన కనుమ రోజు. ఇళ్ళన్నీ అందమైన ముగ్గులతో శోభిస్తూ, అందరికి ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలని అందరూ కోరుకుంటారు, ఈరోజు ఆడపిల్లలకు ప్రత్యేకమైన రోజు, ఈరోజు ఆడ పిల్లలందరు, గొబ్బెమ్మలు పెడతారు, గొబ్బెమ్మ అంటే గోపి+బొమ్మ, అంటే కృష్ణుని భక్తురాళ్ళు అని అర్థం, వీటి చుట్టూ తిరుగుతూ పాటలుపాడుతూ నృత్యం చేస్తూ కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్ధిస్తుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. మాంసాహారులు కాని వారు, గారెల తో (మినుము లో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక దానిని శాకాహార మాంసం గా పరిగణించి కాబోలు) సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం. “గొబ్బెమ్మలు” అంటే కృష్ణుని భక్తురాళ్ళు అని అర్థం”

అందరి జీవితాల్లో ఆనందాన్ని, భోగ భాగ్యాలని, నూతన కాంతిని ఈ సంక్రాంతి నింపాలని, అందరికీ అన్నం పెట్టే రైతన్న చల్లగా, సుఖ సంతోషాలతో కళకళలాడాలని, కోరుకుంటూ “అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు”.

Wednesday, 3 December 2014

ఓ ఉద్యమ యోధుడి వీర చరిత్ర: 'చండ్ర' ప్రచండుడు

Picture
దేశం మనకేమి ఇస్తుందని ఎదురు చూస్తోంది నేటితరం. దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించింది వెనకటితరం. స్వాతంత్య్రం, సమసమాజ నిర్మాణం కోసం వ్యక్తిగత జీవితాలను త్యాగాలు చేసింది ఆనాటి తరం. ఏళ్ళతరబడి ఉద్యమాల్లో,అజ్ఞాత వాసంలో గడిపిన ఆనాటి నాయకుల్లో సుప్రసిద్ధులు చండ్ర రాజేశ్వరరావు. కమ్యూనిస్టు పార్టీకి ఆరున్నర దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో సేవలందించిన రాజేశ్వరరావుగారి సంస్మరించుకునే ప్రయత్నమే ఇది. 

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కి 28 సంవత్సరాల సుదీర్ఘ కాలం నేతృత్వం వహించిన రాజేశ్వరరావు జీవితం వడ్డించిన విస్తరే. ఒడిదుడుకులు లేని బాల్యమే అయినా, 'చిన్ని నా పొట్ట శ్రీరామరక్ష' అని అనుకోకుండా, పేదల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాటాలు సాగించిన యోధుడు. సైద్ధాంతిక నిబద్ధతకు, నిజాయితీకీ నిలువుటద్దం. తెలంగాణా సాయుధ పోరాట యోధులతో జతకట్టిన కమ్యూనిస్టు. దేశాధినేతలతోనైనా,సాటి కామ్రెడ్స్‌తోనైనా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించిన నిర్మొహమాటి. నెహ్రూ,ఇందిరాగాంధీలు తీసుకున్న నిర్ణయాల్లో ప్రజోపయోగమైనవాటిని సమర్ధించిన నోటితోనే,వారి నిరంకుశ చర్యలను తెగనాడిన నిష్పక్షపాతి. అపరకర్మలపై నమ్మకం లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం తండ్రి చితికినిప్పు పెట్టి 'రుణం' తీర్చుకున్న నిజాయితీపరుడు

పేదల పక్షాన నిలిచేందుకు తొలిదినాల్లో చల్లపల్లి జమిందార్‌తో,జాతీయ నాయకునిగా కేంద్రంతో అలుపెరగని పోరాటం సాగించిన యోధుడు.అందుకే,ఆయన పేదల హృదయాల్లో ఇప్పటికీ గూడుకట్టుకుని ఉన్నాడు. చండ్ర రాజేశ్వరరావు భారత కమ్యూనిస్టు పార్టీ తొలితరం అగ్రనాయకుల్లో ఒకరు. ఇంటిపేరుకు తగినట్టుగానే ప్రత్యర్ధులపై చండ్ర నిప్పులు కురిపించేవారు. ఆనాటి తరం నాయకుల్లో కానవచ్చే నిరాడంబరత్వం,నిర్మొహమాటం,నిష్కపటం, నిర్భీతి, నిష్కళంకం వంటి సహజ లక్షణాలన్నీ కలబోసిన వ్యక్తి ఎంత గంభీరమో, మాట కూడా అంతగంభీరమే.ఆనాటితరం వారంతా బహిరంగ సభల్లో మైకులు లేకుండానే మాట్లాడేవారు. రాజేశ్వరరావుగారి భారీ విగ్రహానికి తగినట్టేఆయన స్వరం ఉండేది.అయితే,ఆయన హృదయం వెన్న. 

పీడిత,తాడిత జనోద్ధరణ కోసం ఎంతో ఉజ్వలమైన భవిష్యత్‌ను వదులు కుని కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు.పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, తరిమెల నాగిరెడ్డి,నీలం రాజశేఖరరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు అవిభక్త కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులుగా దశాబ్దాల పాటు రాష్ట్రంలోనే కాక,దేశంలోని పలు ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశారు. 

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలోని మంగళాపురం గ్రామంలో 1914 జూన్‌ ఆరవ తేదీన పెద్ద భూస్వాముల కుటుంబంలో జన్మించిన రాజేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీలో చేరిన తరువాత ఆ భూస్వాములకు వ్యతిరేకంగా, భూమి లేని నిరుపేదల తరఫున దశాబ్దాలపాటు పోరాటం జరిపారు. ఆయన తండ్రి సుబ్బయ్యగారి పూర్వీకులు చెంగల్పట్‌ ప్రాంతానికి చెందిన వారు. వ్యవసాయ పనుల నిమిత్తం నెల్లూరు,గుంటూరు జిల్లాలకు వలస వచ్చిన సుబ్బయ్యగారి పూర్వీకులను చల్లపల్లి జమిందార్‌ తన ఎస్టేట్‌లో స్థిరపడమని కోరాడు. చల్లపల్లికి నాలుగు వైపులా ఉన్న అడవుల్లో గ్రామాలను నిర్మించేందుకు అనుమతి ఇచ్చాడు. అలా ఏర్పడిన గ్రామాల్లో మంగళాపురం ఒకటి. రాజేశ్వరరావుగారు తల్లి తండ్రులకు మూడో సంతానం.ఆయన తరువాత ఒక చెల్లెలు.ఆయన నాల్గవ ఏటనే తల్లి మరణించడంతో పెద తల్లి, నాయనమ్మ,మేనత్తల పెంపకంలో పెరిగారు. 

రాజేశ్వరరావుగారి ప్రాథమిక విద్యాభ్యాసం మంగళాపురంలోనే సాగింది. సెకండరీ విద్య చల్లపల్లిలోనూ సాగింది. బందరు హిందూ స్కూలులో ఎస్సెస్సెల్సీ పూర్తిచేశారు.విద్యార్ధి దశలోనే రాజేశ్వరరావు క్రీడాకారునిగా, పేదల పాలిట ఆత్మీయునిగా పేరొందారు.మనిషి ఆజానుబాహువు కావడం వల్ల ఆయన పేరు చెబితేనే ఆరోజుల్లో రౌడీలు హడలెత్తేవారు. మహాత్మా గాంధీ పిలుపుపై సాగిన ఉప్పు సత్యాగ్రహంలో వలంటీర్‌గా పని చేశారు. యుక్తవయసులోనే విప్లవ భావాల పట్ల ఆకర్షితులయ్యారు.మహాత్మాగాంధీ ఉద్యమాల్లో పనిచేస్తున్నా, విప్లవ కిశోరాలైన భగత్‌సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌ వంటివారి పట్ల ఆరాధనా భావాన్ని పెంచుకున్నారు. బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో చదువుకుంటున్న రోజుల్లోనే ఆయన హిందూ,ముస్లిం ఐక్యత కోసం ఎంతోకృషి చేశారు.కమ్యూనిస్టు నాయకులను ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం మీరట్‌ కుట్ర కేసులో ఇరికించి జైళ్ళలో పెట్టినప్పుడు వారు విడుదల చేసిన ప్రకటన రాజేశ్వరావును ఉత్తేజపర్చింది.వామపక్ష భావాలున్న విద్యార్ధులందరినీ ఐక్యపర్చి సాటి విద్యార్ధులతో కలిసి ఒక స్టడీ సర్కిల్‌ని ఏర్పాటు చేశారు.ఆ తరువాత అది 'యంగ్‌ కమ్యూనిస్టు లీగ్‌'గా అవతరించింది. చదువుకునే రోజుల్లో ఖర్చుల కోసం తండ్రి పంపే డబ్బులో కొంత మిగల్చుకుని రాజేశ్వరరావు,ఆయన సోదరుడు రామలింగయ్యగారు పేదలకు సాయం చేసేవారు. ఓసారి తల్లికి అలహాబాద్‌లో పిండప్రదానం చేయమని తండ్రి డబ్బు పంపిస్తే, ఆ డబ్బుతో పేదలకు అన్నదానం చేశారు. ఆ విషయం దాపరికం లేకుండా తండ్రికి తెలియజేయడం ఆయనలోని నిష్కపటత్వానికి నిదర్శనం. 

బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లోనే మతవాద,మితవాద వర్గాలను ధైర్యంగా ఎదుర్కొన్న ధీశాలి రాజేశ్వరరావు. తరచుగా ఘర్షణలకు దిగడం, కమ్యూనిస్టు వర్గానికి నాయకత్వం వహించడంతో బిఎస్సీ పూర్తి కాకముందే ఆయన యూనివర్శిటీ నుంచి టీసీ తీసుకుని బయటికి వచ్చారు. బెనారస్‌లో ఉండగానే ఆయన లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకు హాజరయ్యారు. జవహర్‌లాల్‌ నెహ్రూ సోవియట్‌ రష్యా సందర్శించి వచ్చిన తరువాత సోషలిజం,స్వాతంత్య్ర పోరాటంలో కార్మిక,కర్షక పాత్ర, వర్గ సం ఘాలు,వర్గ పోరాటాల పేరిట రాసిన వ్యాసాలు రాజేశ్వరరావును విశేషంగా ఆకర్షించాయి.అదే సందర్భంలో ఆయన మహాత్మాగాంధీని కలిసిన విద్యార్ధి బృందంలో ఉన్నారు. ఆ తరువాత ఆయన ఇంటికి వచ్చి తండ్రి గారి అనుమతితో విశాఖలో మెడిసిన్‌లో చేరారు. అయితే,అక్కడ కూడా ఆయన కమ్యూనిస్టు భావాల ప్రచారానికి నిడమర్తి ఉమారాజేశ్వరరావు ప్రభృతులతో కలిసి స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టు భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పట్లో ఆంధ్రా యూనివర్శిటీకి భారత రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాథాకృష్ణన్‌ వైస్‌చాన్సలర్‌గానూ, ప్రొఫెసర్‌ హిరేన్‌ ముఖర్జీ అధ్యాపకునిగాను ఉండేవారు.విశాఖలో ఉన్నప్పుడే వివిధ కార్మిక సంఘాల కు నేతృత్వం వహించారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం వల్ల ఆయన చదువు బెనారస్‌లోనూ, విశాఖలోనూ సవ్యంగా సాగలేదు. 

తండ్రి అభిమతానికి వ్యతిరేకంగా ఆయన సావిత్రమ్మగారితో వివాహాన్ని అతి నిరాడంబరంగా దండల మార్పుతో చేసుకున్నారు. వారి వివాహానికి ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు మద్దూరి అన్నపూర్ణయ్య పెళ్ళిపెద్దగా వ్యవహించారు. సావిత్రమ్మ కూడా భర్త మార్గంలోనే కమ్యూనిస్టు ఉద్యమం ప్రచారం కోసం జీవితాంతం కృషిచేశారు. వివాహానికి గుర్తుగా మెడలో వేసుకున్న గొలుసు రాయిని తీయించి ఎర్ర నక్షత్రాన్ని వేసుకోవడం ఆమె నిబద్ధతకు నిదర్శనం. పార్టీ నిర్ణయం మేరకు పూర్తి కాల కార్యకర్తగా పనిచేయడం కోసం ఆమె శాంతినికేతన్‌లో చదువుకోవాలనే ఆకాంక్షను బలవంతంగా అణగదొక్కుకున్నారు. 

కృష్ణా జిల్లాలో కమ్యూనిస్టుపార్టీ విస్తరణకు రాజేశ్వరరావు దంపతులు విశేషంగా కృషిచేశారు. కార్మిక,కర్షక సంఘాలను ఏర్పాటు చేసి, మంగళాపురం కూలీల పోరాటానికి,చల్లపల్లి జమిందారు అక్రమాలపై ఉద్యమానికి నేతృత్వం వహించారు. కృష్ణాజిల్లా తిరువూరు తాలూకాలో నైజాం సరిహద్దున ఉన్న తునికిపాడులో రాజకీయ పాఠశాలకు వచ్చిన రావి నారాయణరెడ్డి,బద్దం ఎల్లారెడ్డి ప్రభృతులు నైజాంలో పరిస్థితి గురించి వివరించారు. ఆ క్రమంలోనే రాజేశ్వరరావుకు ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చిర్రావూరి లక్ష్మీనరసయ్య ప్రభృతులు కూడా రావడంతో వారందరితో కూడా రాజేశ్వరరావుకు పరిచయాలు ఏర్పడ్డాయి. క్రమంగా తెలంగాణాలో అనేకసార్లు పర్యటించి తెలంగాణాలో పార్టీ నిర్మాణానికీ,భువనగిరి ఆంధ్ర మహాసభ నిర్వహణకు తోడ్పడ్డారు. తెలంగాణా కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనాయకులను సమన్వయపర్చడంలో,సాయుధ పోరాటంలో కీలకపాత్ర వహించారు.

భారత విప్లవోద్యమం గురించి స్టాలిన్‌తో చర్చించేందుకు అజయ్‌ ఘోష్‌, ఎస్‌ఏ డాంగే,బసవపున్నయ్యలతో పాటు రాజేశ్వరరావు మాస్కో వెళ్ళారు. రాజేశ్వరరావు ఎంత పెద్ద నాయకుడైనా ఏమాత్రం అభిజాత్యాన్ని ప్రదర్శించకుండా,నిరంతరం ఏదో తెలుసుకోవాలనే తపనతో ఉండేవారు. పుచ్చలపల్లి సుందరయ్యగారి పట్ల ఎంతో గౌరవం ఉన్నా,అవిభక్త కమ్యూనిస్టు పార్టీ చీలినప్పుడు ఆయన భారత కమ్యూనిస్టు పార్టీకి నేతృత్వం వహించారు. ఆ తరువాత ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఐక్య పోరాటాలకు నేతృత్వం వహించాయి. 1969లో కాంగ్రెస్‌ చీలిపోయినప్పుడు ఆనాటిప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటి ప్రగతి శీల కార్యక్రమాలకు ఎస్‌ఎ డాంగే నేతృత్వంలోని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మద్దతు ఇచ్చింది.రాజేశ్వరరావు సిద్ధాంతాలతో ఏనాడూ రాజీ పడలేదు.ఇందిర ప్రభుత్వం తీసుకున్న ప్రగతి శీల చర్యలకు మద్దతు ఇచ్చినప్పటికీ, ఆమె నిరంకుశ పోకడలను తీవ్రంగా వ్యతిరేకించారు, 1970వ దశకంలో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో సాగిన భూ ఆక్రమణ ఉద్యమం పార్టీ ప్రతిష్ఠను పెంచింది.అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఉద్యమం విజయవంతం కావడంలో రాజేశ్వరరావుగారి పాత్ర ఎంతో ఉంది. 

రాజేశ్వరరావు పిత్రార్జితంలో వచ్చిన ఆస్తిలో తన వాటాను పూర్తిగా పార్టీకోసం వెచ్చించారు.పార్టీకి ఆయన విరాళంగా ఇచ్చిన లక్షలాది రూపాయిలతోఆరోజుల్లో వందలాది ఎకరాలను కొనగలిగి ఉండేవారు.కానీ,ఆయన ఆస్తులపై మమకారాన్ని ఏనాడూ పెంచుకోలేదు. హైదరాబాద్‌ చిక్కడపల్లి సొసైటీలో ఇల్లు ఇస్తామన్నా వద్దన్నారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలో స్థలాన్ని తీసుకోమని మిత్రులు ఎంత కోరినా తీసుకోలేదు.ఆయన ఢిల్లీ వెళ్ళినా,ఎక్కడికి వెళ్ళినా పార్టీ కార్యాలయాల్లోనే బస చేసేవారు, తన బట్టలను తానే ఉతుక్కునే వారు. ఎంత ఎదిగినా,ఎంత పేరు ప్రతిష్ఠలు సంపాదించినా ఆయన చివరి వరకూ నిరాడంబరంగానే జీవితం గడిపారు. పంజాబ్‌లో తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు కమ్యూనిస్టుపార్టీ తరఫున ఆయన సాగించిన కృషి మరువ లేనిది.అక్టోబర్‌ విప్లవం 60వ వార్షికోత్సవాల సందర్భంగా భటిండాలో జరిగిన పార్టీ మహాసభలో ఆమోదించిన తీర్మానం చరిత్రాత్మకమైనది.రాజేశ్వరరావు సోవియట్‌ యూనియన్‌లో గోర్బొచెవ్‌ ప్రవేశపెట్టిన సహకార వ్యవసాయం, కాంట్రాక్ట్‌ సేద్య విధానాలను రాజేశ్వరరావు సమర్ధించారు. దీనిపై ఆయన పార్టీ పత్రిక న్యూ ఏజ్‌లో వ్యాసం రాస్తూ భూముల్ని 25 నుంచి 35 సంవత్సరాల పాటు కౌలుకు ఇవ్వడం వల్ల భూసారాన్ని కాపాడబడుతుందనీ, ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు.సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిన తరువాత సంభవించిన పరిణామాల పట్ల ఆయన చివరి రోజుల్లో ఎంతో కలత చెందారు. 

పాలస్తీనా విమోచనా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.ప్రపంచంలో ఎక్కడ ప్రగతి శీల పోరాటాలు జరిగినా వాటికి ఆయన మద్దతు ప్రకటించేవారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అనేక సమస్యలపై ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉన్నప్పటికీ, సిపిఎం వ్యతిరేకధోరణి వల్ల ఉభయ కమ్యూనిస్టు పార్టీల పునరేకీకరణ ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆవేదన చెందేవారు.అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిపిన ప్రపంచ దేశాలకు భారత కమ్యూనిస్టుపార్టీ అండగా నిలవడంలో రాజేశ్వరరావుగారి పాత్ర ఎంతో ఉంది. ఆయన ఎన్నో పురస్కారాలను పొందినప్పటికీ, 1974 లో పొందిన సోవియట్ యూనియన్ అత్యంత ప్రతిష్ఠాకరమైన ఆర్డర్‌ ఆఫ్‌ లెనిన్‌ పురస్కారం మకుటాయమానమైనది. సుదీర్ఘకాలం పార్టీకోసం అహర్నిశలు కృషిచేసిన రాజేశ్వరరావు ఎనభైయవ ఏట 1994 ఏప్రిల్‌ 9వ తేదీన హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన పేరిట హైదరాబాద్‌ సిఆర్‌ ఫౌండేషన్‌ పని చేస్తోంది. కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కోసం అలుపెరగని పోరాటం సాగించిన రాజేశ్వరరావు ఆ ఉద్యమ ధ్రువతారగా చిరస్మరణీయులు. డా కిలారు పూర్ణచంద్రరావు

Monday, 24 November 2014

నెట్టింట్లో కూడా 'ఈనాడే' నెంబర్ -1

Picture
తెలుగు వార్తా పత్రికల్లో అత్యధికంగా చదివేది 'ఈనాడు' అనే విషయం అందరికి తెలిసిందే! ప్రింట్ మీడియా లోనే కాదు వెబ్ మీడియా లో కూడా ఈనాడే  నెంబర్ 1. ఇంటర్నెట్లో వీక్షకులు ఎక్కువగా  తిలకిస్తున్నది కూడా 'ఈనాడు' పేపర్ మాత్రమే. నాణ్యమైన, విశ్వసనీయమైన వార్తల విషయంలో దేశ, విదేశాల్లోని తెలుగు వారు 'ఈనాడు' పేపర్ కే ఆగ్రతాంబులం ఇచ్చారు.

సాక్షి పేపర్ కు, ఈనాడు పేపర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇక 'నమస్తే తెలంగాణా' పేపర్ ఐతే కనీసం సోదిలో కూడా లేదు.


ఈనాడు : వరల్డ్ ర్యాంకు : 989, ఇండియా ర్యాంకు : 96, USA ర్యాంకు : 1,698
సాక్షి: వరల్డ్ ర్యాంకు : 1614, ఇండియా ర్యాంకు : 134, USA ర్యాంకు : 5,547
నమస్తే తెలంగాణా: వరల్డ్ ర్యాంకు : 9,226, ఇండియా ర్యాంకు : 775, USA ర్యాంకు : 25,493