తెలుగు లోగిళ్ళకు “తొలికాంతి” సంబరాల సంక్రాంతి
అంబరాన్ని అంటిన సంబరాల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేశాం, అందరూ బావుండాలి, అంతా మంచే జరగాలి అనే ఆశతో భవిష్యత్తుకు బాటలు పరిచేశాం. గత కొంతకాలంగా ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో విపత్కర పరిస్థితుల మధ్య క్షణ క్షణం భయంతో గడిపిన రైతన్న చల్లగా, చల్లని గాలుల మధ్య, ప్రశాంతంగా సేద తీరుతున్నాడు. పరవళ్ళు తొక్కిన నదులు, సంద్రాలు, కాలువల సాక్షిగా, తన చమట జల్లుని చిందించి నేల తల్లిని పులకరింప చేసి పచ్చని పల్లెలో వెలుగు నింపుతూ పచ్చగా రంగు వేసినట్లుగా పండిన పంటను చూసి ఎద్దుకొమ్ముల మధ్య సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ సంక్రాంతి పండగ చేసుకుంటున్నాడు.
అసలు సంక్రాంతి అంటే! చల్లని గాలుల నడుమ, పచ్చని పైరుల నడుమ, ప్రతీ ఊరు, ప్రతీ ఇల్లు ధాన్యపు రాశులతో, డూ డూ బసవన్నల నృత్యాలు, గంగిరెద్దు వాళ్ళ విన్యాసాలు, ఉషోదయాన్నే హరిదాసు చేసే గజ్జెల చప్పుళ్ళు, భం భం అనే జంగర దేవరలు, హంగామాతో హాస్యన్ని పండించే పగటి వేషగాళ్ళు, మా ఇంటికి రండీ అని స్వాగతించే గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు, గాలి పటాలతో సందడి చేసే పిల్లలు, ముంగిట్లో ఇంద్ర ధనస్సును నిలిపే రంగవల్లులు పందెం రాయుళ్ళ పౌరుషానికి పదును పెడుతూ వేసే కోడి పందాలు, చిట్టి పొట్టి పాపల బుడి బుడి అడుగులు, కొత్తగా పెళ్ళైన జంటలు, ఇలా అందరి సమక్షంలో బొమ్మల కొలువులతో, భోగి మంటల చాటున చల్లని ఉదయాన్ని ఆస్వాదిస్తూ, పాత వస్తువులను, కష్టాలను, భోగి మంటలకు సమర్పిస్తూ, చిన్నారులకు భోగి పళ్ళు పోస్తూ ఇబ్బందులు, ప్రమాదాలు ఇలా ఏమి కలగకుండా అందరు సుఖ సంతోషాలతో కలిసి ఉండాలి, ప్రతీ ఇల్లు ఒక హరివిల్లులా మారాలి. అదే అసలైన సంక్రాంతి, అందమైన, ఆనందమైన జీవితాలలో తొలి కాంతి. అసలు సంక్రాంతి అంటే పురాణాల సాక్షిగా సంక్రమణం, అంటే మార్పు చెందడం, సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి ఎందుచేతనంటే సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశిస్తాడు, అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత కలదు, ఈ మాసంలో మకర సంక్రాంతి రోజున, సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు అందుకే ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతన్నల కళ్ళల్లో విరిసే కోటి కాంతులతో, అనందాల కోలాహలంతో, ఈ పండుగను మూడు రోజులుగా చేసుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. అందుకే దీనిని పెద్ద పండుగా అని కూడా పిలుస్తారు, మూడు రోజుల పండగలో మొదటిగా
భోగ భాగ్యాలను ఇచ్చే భోగి. ఈ అందమైన పండుగలో మొదటి రోజును భోగి అని పిలుస్తారు. ఈరోజు అందరూ భోగి మంటలతో ఉల్లాసంగా గడుపుతారు. ఈరోజు అందరూ ఉదయాన్నే లేచి ఎముకలు కొరికే చలిని తరిమేయడానికి పాతవస్తువులు అన్నీ సమకూర్చి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా వాటిని భోగి మంటల్లో మంట పెడుతూ చల్లని ఆ చలిలో వెచ్చదనాన్ని ఆశ్వాదిస్తారు. ఇక సాయంత్రం వేళ, బొమ్మల కొలువులతో, చాలా ఇళ్ళలో చిన్నపిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శిస్తూ ఆనందంగా, ఉల్లాసంగా అడుతూపాడుతూ గడుపుతారు. ఇక భోగి పళ్ళ పేరంటాలైతే అందరూ సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. అలా పండుగలో మొదటి రోజు, తొలి ఘట్టం పూర్తి అవుతుంది.తెలుగు సాంప్రదాయానికి ప్రతీక, సుఖ సంతోషాల గీతిక సంక్రాంతి పండుగ
మకర సంక్రాంతి రెండవ రోజు, అసలైన పండుగ రోజు సంక్రాంతి. ఈరోజు తెల్లవారగానే పాలు పొంగించి, కొత్త బట్టలు వేసుకుని, రుచికరమైన పిండి వంటలు తింటూ, సంతోషంగా గడుపుతూ ఈ పండుగను ఆస్వాదిస్తారు, మరో ప్రత్యేకత ఏమిటంటే సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. మరో ఆనందమైన, అలరించే విషయం ఏమిటంటే ఈ రోజున “హరిలో రంగ హరీ” అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమై సందడి చేస్తాడు. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ సరదాగా గడుపుతారు. రథం ముగ్గు, రంగ వల్లులతో ఇంటి ముంగిళ్ళు కళకళలాడతాయి. అయితే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు.
“ఆకలికి అన్నం పెట్టే రైతన్న కళకళలాడుతూ ప్రపంచమంతా వెలుగు నింపాలి”
సంక్రాంతి పండుగ మూడవ రోజు, చివరిదైన కనుమ రోజు. ఇళ్ళన్నీ అందమైన ముగ్గులతో శోభిస్తూ, అందరికి ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలని అందరూ కోరుకుంటారు, ఈరోజు ఆడపిల్లలకు ప్రత్యేకమైన రోజు, ఈరోజు ఆడ పిల్లలందరు, గొబ్బెమ్మలు పెడతారు, గొబ్బెమ్మ అంటే గోపి+బొమ్మ, అంటే కృష్ణుని భక్తురాళ్ళు అని అర్థం, వీటి చుట్టూ తిరుగుతూ పాటలుపాడుతూ నృత్యం చేస్తూ కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్ధిస్తుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. మాంసాహారులు కాని వారు, గారెల తో (మినుము లో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక దానిని శాకాహార మాంసం గా పరిగణించి కాబోలు) సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం. “గొబ్బెమ్మలు” అంటే కృష్ణుని భక్తురాళ్ళు అని అర్థం”
అందరి జీవితాల్లో ఆనందాన్ని, భోగ భాగ్యాలని, నూతన కాంతిని ఈ సంక్రాంతి నింపాలని, అందరికీ అన్నం పెట్టే రైతన్న చల్లగా, సుఖ సంతోషాలతో కళకళలాడాలని, కోరుకుంటూ “అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు”.
No comments:
Post a Comment